న్యూయార్క్: వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తుతం అమెరికా చెరలో ఉన్నారు. ఆ కేసును ఫేమస్ క్రిమినల్ లాయర్ బ్యారీ పొల్లాక్(Barry Pollack) వాదిస్తున్నారు. అమెరికాలో చాలా అనుభవం ఉన్న క్రిమినల్ లాయర్ ఆయన. మదురోపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. నార్కో-టెర్రరిజం, కొకైన కుట్ర, మెషీన్ గన్నులు కలిగి ఉండడంతో పాటు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు కేసులు బుక్ చేశారు. గతంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే తరపున వాదించిన బ్యారీ పొల్లాక్ ఇప్పుడు మదురో తరపున అమెరికా కోర్టులో వాదించనున్నారు. సోమవారం కోర్టుకు వచ్చిన మదరోను జిల్లా జడ్జి అల్విన్ హెల్లర్‌స్టీన్ ప్రశ్న వేశారు. పరిచయం చేసుకోవాలని కోరగా, ఆ సమయంలో మాట్లాడుతూ తాను వెనిజులా అధ్యక్షుడిని అని మదురో అన్నారు. యుద్ధ ఖైదీని అయినట్లు చెప్పారు. అయితే మార్చి 17వ తేదీన ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నారు.
క్రిమినల్ లాయర్ బ్యారీ జే పొల్లాక్కు సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్నది. హై ప్రొఫైల్ కేసుల్లో ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, గవర్నమెంట్ అధికారులు, దిగ్గజ సంస్థల తరపున కేసులను వాదించారు. అమెరికన్ కాలేజీ్ ఆఫ్ ట్రయల్ లాయర్స్, అమెరికన్ బో ర్డ్ ఆఫ్ క్రిమినల్ లాయర్స్ సభ్యుడిగా ఉన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్స్ సంఘానికి అధ్యక్షుడిగా చేశారు.తన కెరీర్లో ఎన్నో పెద్ద కేసుల్ని ఆయన వాదించారు. వికీలీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజేకు బెయిల్ ఇప్పించారు. ఓ కేసులో ఎన్రాన్ ఎగ్జిక్యూటివ్‌ను నిర్దోషిగా తేల్చారు. మేరీల్యాండ్‌లో అసిస్టెంట్ ఫెడరల్ పబ్లిక్ డిఫెండర్‌గా చేశారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఫెడరల్ చట్టాలను బోధిస్తున్నారు.