వాషింగ్టన్: తుపాకీ కలిగి ఉన్న వ్యక్తి బారి నుంచి తప్పించుకునేందుకు ఒక మహిళ ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన జరిగింది. ఒక అపార్ట్మెంట్ భవనంలోని ఎనిమిదో అంతస్తులో నివాసం ఉంటున్న ఒక మహిళ, మరో వ్యక్తి మధ్య గురువారం వివాదం జరిగింది. ఆ వ్యక్తి రైఫిల్ మాదిరిగా ఉన్న ఆయుధాన్ని బయటకు తీశాడు. దీంతో ఆమె భయాందోళన చెందింది. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తులోని తన ఇంటి కిటికీ నుంచి కిందకు దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటన అనంతరం 22 ఏండ్ల అనుమానితుడు కైలీ జమాల్ పామర్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ రాత్రికి తిరిగి అక్కడకు వచ్చిన ఆ వ్యక్తిని హత్యాయత్నం కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని ఆయుధం, మందుగుండును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.