TikTok | ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించిన 24 గంటల్లోనే అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించింది. చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తుండటంతో.. ఒక్కరోజు ముందుగానే తన సేవలను నిలిపివేసింది. కానీ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ అంటూ బైట్‌డ్యాన్స్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా టిక్‌టాక్ సేవలను మళ్లీ అమెరికాలో పునరుద్ధరించడానికి కీలక కారణం ఆ దేశ నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరిస్తామని ట్రంప్ ప్రకటించారు. లక్షలాది మంది అమెరికన్లు ఈ యాప్‌పై ఆధారపడ్డారని.. అందుకే నిరంతరం ఈ యాప్ అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తామని తెలిపారు. అమెరికాలో తమ సేవలను పునరుద్ధరణపై ట్రంప్ నుంచి భరోసా లభించడంతో ఆయనకు టిక్‌టాక్ ధన్యవాదాలు తెలిపింది. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొంది. ఏదేమైనా అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన 24 గంటల్లోనే పునరుద్ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా భారత్‌లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన పరిస్థితులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ 2017లో టిక్‌టాక్‌ను ప్రారంభించింది. షార్ట్వీడియోల కోసం రూపొందించిన ఈ యాప్ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. కానీ టిక్‌టాక్ యాప్ భారత వినియోగదారుల నుంచి డేటాను సేకరించి చైనాలోని సర్వర్లలో స్టోర్ చేస్తోందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం 2020లో నిర్ణయం తీసుకుంది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌తో పాటు మరో 50 యాప్‌లోను బ్యాన్ చేసింది. దీనికి భారత వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుశ్చర్య కూడా కారణమనే చెప్పొచ్చు. 2020 జూన్ 15వ తేదీన లఢాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలోకి చైనా సైనికులు చొరబడి దాడి చేసింది. ఆ ఘటనలో 20 మంది భారతీయ జవాన్లు మరణించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం.. వారం రోజుల్లోనే చైనాకు చెందిన 50 యాప్‌లపై నిషేధం విధించింది.
టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ నష్టమే జరిగిందని చెప్పుచ్చు. భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లను టిక్‌టాక్ కోల్పోయింది. దీనివల్ల రెవెన్యూపరంగా చాలా నష్టపోయింది. దీంతో భారత మార్కెట్లో మళ్లీ పాగా వేసేందుకు టిక్‌టాక్ ప్రయత్నాలు చేసినప్పటికీ భారత్ పట్టించుకోలేదు. దాదాపు నాలుగేళ్లుగా అదే బ్యాన్ నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఇప్పటివరకు కూడా టిక్‌టాక్‌ను తిరిగి తీసుకొచ్చే దిశగా ఆలోచనలు చేయలేదు. కానీ అగ్ర రాజ్యం అమెరికా మాత్రం దేశ భద్రతను రిస్క్‌లో పెట్టి మరీ 24 గంటల్లోనే టిక్‌టాక్‌ను పునరుద్ధరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
అమెరికాలో టిక్‌టాక్‌కు దాదాపు 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే టిక్‌టాక్ యాప్ తమ వినియోగదారుల నుంచి డేటాను సీక్రెట్‌గా సేకరిస్తుందని చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అమెరికా ప్రభుత్వం.. దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించి చైనాలోని డేటా సెంటర్లలో భద్రపరుస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను 2025 జనవరి 19వ తేదీలోగా అమెరికా కంపెనీకి విక్రయించాలని గతేడాది ఏప్రిల్‌లో అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది. గడువులోపు విక్రయించకుంటే యాప్‌పై నిషేధం విధిస్తామని బిల్లులో పేర్కొంది. దీనిపై టిక్‌టాక్ కంపెనీ అమెరికా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై జనవరి 17వ తేదీన విచారణ జరిపిన సుప్రీంకోర్టు దేశభద్రతే ముఖ్యమని అభిప్రాయపడింది. జనవరి 19లోగా టిక్‌టాక్‌ను యూఎస్‌కు విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారో నిర్ణయించుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే టిక్‌టాక్ సేవల్ని అమెరికాలో ఆపివేస్తున్నట్లు టిక్‌టాక్ ప్రకటించింది. దీంతో గూగుల్, ఇతర యాప్ సంస్థలు తమ ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ యాప్‌ను తొలగించాయి. ఈ పరిణామం వేళ ఉమ్మడి వెంచర్లో 50 శాతం వాటా ఉండాలని కోరుకుంటున్నానని.. దానికి అంగీకరిస్తే టిక్‌టాక్‌ను రక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ మద్దతుతో టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.