Nasa | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాత్కాలికంగా మూతబడింది. అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి షట్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నాసా కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ఈ మేరకు నాసా అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటనను ఉంచింది. ఫెడరల్ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా నాసా వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయడం లేదంటూ అందులో చూపిస్తోంది.
అమెరికా కాంగ్రెస్ ఫండింగ్ బిల్లుపై అంగీకారం కుదరకపోవడంతో అగ్రరాజ్యం షట్‌డౌన్ ఎదుర్కొంటోంది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్ 1వ తేదీ నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో యూఎస్ ప్రభుత్వం అత్యవసరాలకు మాత్రమే తన డబ్బును ఖర్చు చేస్తోంది. అంటే మిలటరీ, ఆస్పత్రులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర విభాగాల్లో మాత్రమే సేవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను నిలిపివేసింది. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయిన జాబితాలో నాసా కూడా చేరింది.
నాసాలోని అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా కార్యకలాపాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, శాస్త్రీయ పరిశోధనల ప్రాజెక్టులు, కాంట్రాక్టు పనులు అన్ని ఆగిపోయాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉన్న వ్యోమగాముల పర్యవేక్షణ, గ్రహశకలాలపై నిఘా, ఇప్పటికే ప్రయాణంలో ఉన్న అంతరిక్ష నౌకల మిషన్ కంట్రోల్ కార్యకలాపాలను మాత్రం నాసా కొనసాగిస్తోంది. ఈ షట్‌డౌన్ ప్రభావం వల్ల నాసా రాబోయే రోజుల్లో చేపట్టబోయే మిషన్స్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అర్టెమిస్ ప్రోగ్రామ్ కింద వ్యోమగాములను మరోసారి చంద్రునిపైకి పంపించే పనిలో నాసా నిమగ్నమయ్యింది. వచ్చే ఏడాది ఈ మిషన్ లాంచ్ అవ్వాల్సి ఉంది. అలాగే ఇతర అంతరిక్ష ప్రయోగాలను కూడా చేపట్టే యోచనలో ఉంది. ఒకవేళ ఈ నిధుల సంక్షేభం ఎక్కువ రోజులు కొనసాగితే షట్‌డౌన్‌తో నాసా మిషన్స్ చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Nasa Website