Ban Masturbation | వాషింగ్టన్, జనవరి 31: పురుషులు హస్త ప్రయోగం చేసుకోకుండా నిషేధించాలని, అతిక్రమిస్తే నేరంగా పరిగణించాలని అమెరికా సెనేట్ ముందుకు ఒక బిల్లు వచ్చింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మిసిసిప్పి సెనేటర్ బ్రాడ్ఫర్డ్ బ్లాక్‌మన్ గత వారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ‘గర్భనిరోధకం అంగస్తంభన వద్ద ప్రారంభం’ అని పేరు పెట్టారు. ఒకవేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే మిసిసిప్పి రాష్ట్రంలో పురుషులు హస్త ప్రయోగం చేసుకోవడం, పిండాన్ని ఫలదీకరించే ఉద్దేశం లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరం అవుతుంది.
చట్టాన్ని అతిక్రమించిన వారికి మొదటిసారి రూ.86 వేలు, రెండోసారి రూ.4.33 లక్షలు, తరచూ ఉల్లంఘించే వారికి రూ.8.65 లక్షల జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వీర్యదానం కోసం హస్త ప్రయోగం చేసుకోవడం, కండోమ్ వాడి శృంగారంలో పాల్గొనడం మాత్రం ఈ బిల్లు ప్రకారం నేరం కాదు. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు దాదాపుగా లేవు.
ఈ బిల్లు ప్రవేశపెట్టిన బ్లాక్మన్పై విమర్శలతో పాటు బెదిరింపులు కూడా వస్తున్నాయట. తాను మాత్రం అమెరికా శాసన ప్రక్రియలోని ద్వంద్వ ప్రమాణాలను వెలుగులోకి తీసుకురావడానికే వ్యంగ్య రూపంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు బ్లాక్‌మన్ చెప్తున్నారు. మహిళల పునరుత్పత్తి హక్కులపై ఆంక్షలకు ఇది ప్రతిస్పందన అని తెలిపారు. దేశంలో, ముఖ్యంగా మిసిసిప్పిలో గర్భనిరోధకం, అబార్షన్‌కు సంబంధించి ప్రవేశపెడుతున్న మెజార్టీ బిల్లులు మహిళల పాత్రపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని, పురుషుల పాత్రను పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. గర్భనిరోధకంలో పురుషుల పాత్ర ఉంటుందనే నిజాన్ని చర్చకు తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని చెప్పారు.