Israel-Hamas War | జెరూసలేం, అక్టోబర్ 14: హమాస్ గ్రూపును పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే శుక్రవారం గాజాలోకి ప్రవేశించాయి. హమాస్ ఆకస్మిక దాడుల అనంతరం ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు భూతల దాడులు ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది. గాజా సరిహద్దు వైపునకు మరిన్ని ఇజ్రాయెల్ బలగాలు కదులుతున్నాయి. ఏరియల్ పెట్రోలింగ్ వ్యవస్థను పంపతున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలతో ఉత్తర గాజాలోని వేలాది పాలస్తీనా కుటుంబాలు వలస ప్రారంభించాయి. ఇజ్రాయెల్ సైన్యం వీరి కోసం శనివారం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వెళ్లిపోయేందుకు రెండు ప్రధాన మార్గాలు ఏర్పాటు చేసింది. ఈ గడువులో ప్రజల దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచించింది. మరోవైపు గాజాలోని విదేశీయులు రఫా సరిహద్దు దాటి ఈజిప్టులోకి ప్రవేశించేందుకు ఈజిప్టు, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని ఈజిప్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.
గాజాపై డ్రోన్ దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ అబు మురాద్ హతమయ్యారని ఇజ్రాయెల్ వెల్లడించింది. మురాద్ హమాస్ ఏరియల్ ఆపరేషన్ల గ్రూపు హెడ్‌గా ఉన్నాడని పేర్కొన్నది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు ఒకరు మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
శత్రువులు మూల్యం చెల్లించుకోవడం ప్రారంభమైందని, తర్వాత ఏం జరుగుతుందో మాత్రం బయటకు చెప్పలేనని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనన్నారు. హమాస్ నాశనమే తమ లక్ష్యమని మరోసారి పునరుద్ధాటించారు.
సరైన సమయంలో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్‌తో కలిసి పోరాడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా గ్రూపు పేర్కొన్నది.
యుద్ధంలో 1,500 మంది హమాస్ మిలిటెంట్లు సహా రెండు వైపులా మరణాల సంఖ్య 5 వేలకు పైగా చేరింది. గాజాలో 2,215 మంది పౌరులు మరణించగా, ఇజ్రాయెల్‌లో పలువురు జవాన్లు సహా 1,300 పౌరులు మృతిచెందారు.
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మందితో రెండో విమానం శనివారం ఢిల్లీకి చేరింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులపై నిషేధాన్ని ఎయిరిండియా 18 వరకు పొడిగించింది. శిక్షణ నిమిత్తం ఇజ్రాయెల్‌కు వెళ్లిన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టీ రమేశ్ ఆ దేశంలో చిక్కుకుపోయారని ఆయన భార్య తెలిపారు. ఆయన్ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.