కాలిఫోర్నియా: అమెరికా ఈ నెల 21న నిర్వహించిన అన్ఆర్మ్డ్ మినిట్‌మన్-3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగం విజయవంతమైంది. ఇది అణ్వాయుధ సామర్థ్యం కలది. దీనిని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించింది. అమెరికా వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో ఇది కీలక ఘట్టం. ఈ క్షిపణికి మార్క్-21 రీఎంట్రీ వెహికిల్‌ను అమర్చారు.
ఈ క్షిపణి 4,200 మైళ్ల దూరంలోని రిపబ్లిక్ ఆఫ్ ది మార్షల్ ఐలండ్స్‌లో ఉన్న క్వాజాలీన్ అటోల్‌పై ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఛేదించింది. మినిట్మాన్-3 పరిధి దాదాపు 13,000 కిలోమీటర్లు. ఇది ఖండాలను దాటుకుని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.85 మీటర్లు, బరువు 34,000 కేజీలు. అణ్వాయుధ దాడులను నిరోధించే సత్తా దీనికి ఉంది.