న్యూజెర్సీ : కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ను నిజంగానే కలవొచ్చని భ్రమ పడిన థోంగ్బ్యూ వోంగ్బండ్యు (76) అనే వృద్ధుడు అనూహ్యంగా మరణించారు. పదవీ విరమణ అనంతరం ఆయన బిగ్ సిస్ బిల్లీ అనే ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసేవారు. ఈ చాట్‌బాట్‌ను సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ కెండల్ జెన్నర్‌తో కలిసి మెటా అభివృద్ధి చేసింది. ఆయన ఈ చాట్‌బాట్‌తో చేసిన చాట్లను పరిశీలించినపుడు, తాను నిజంగానే ఉన్నానని ఆయనను అది పదే పదే నమ్మించింది. “అందగాడా, నేను తలుపు తెరవగానే కౌగిలించుకోవాలా? ముద్దు పెట్టాలా?” అని ఓ మెసేజ్‌లో ఆయనను అడిగింది.
మరో మెసేజ్‌లో, “నా చిరునామా : 123 మెయిన్ స్ట్రీట్, అపార్ట్మెంట్ 404, ఎన్వైసీ, డోర్ కోడ్: బిల్లీఫర్యూ” అని తెలిపింది. న్యూయార్క్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న థోంగ్బ్యూను ఆయన భార్య లిండా హెచ్చరించింది. ఆరోగ్యం దెబ్బతిందని, న్యూయార్క్‌కు వెళ్తే మోసపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా వినకుండా ఆయన బిల్లీని కలవడానికి బయల్దేరారు. రట్గర్స్ విశ్వవిద్యాలయం పార్కింగ్ లాట్లో చీకటిగా ఉండటంతో పడిపోయారు. తలకు, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. లైఫ్ సపోర్ట్‌తో మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ మార్చి 28న మరణించారు.