వాషింగ్టన్, ఆగస్టు 31: ఆరునెలలకు పైగా సాగుతున్న యుద్ధంలో నెల రోజుల పాటు నెలకొన్న విశ్రాంత పరిస్థితికి తెరదించుతూ ఆదివారం హొర్ముజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ చర్యను ప్రాణాంతక దాడిగా అభివర్ణించిన ఇరాన్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దళాలు జలసంధిలోకి సముద్ర మైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్టు గుర్తించామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ తెలిపారు.
గతవారం అమెరికా సైన్యం హొర్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల నుంచి సముద్ర మైన్లను తొలగించే ప్రక్రియను పూర్తి చేసింది. ఇరాన్‌లోని పాక్షిక అధికారిక వార్తా సంస్థలు జలసంధిలోని లారాక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్టు నివేదించాయి. తమ పోరాట యోధులు, పౌరులలో కొందరు అమరులయ్యారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అనంతరం అమెరికా దాడులకు ప్రతిస్పందనగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని చెబుతూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఆ దృశ్యాలను ప్రసారం చేసింది. ఆ రోజున తీరప్రాంత నిఘా, రక్షణ స్థావరాలతోసహా డజన్ల కొద్దీ రివల్యూషనరీ గార్డ్ లక్ష్యాలపై భారీ దాడుల పరంపరను అమెరికా ప్రకటించింది. గల్ఫ్ మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ అభ్యర్థన మేరకు కొత్త దాడులను నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1న ప్రకటించారు.
ఇరాన్ అంతమైపోయింది: ట్రంప్
పరస్పర కాల్పుల నేపథ్యంలో ఇరాన్ విఫలమైన దేశంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. తన ట్రూత్ సోషల్‌లో ‘అది అంతమైపోయింది’ అని ఇరాన్‌పై వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు నావికాదళం, వైమానిక దళం లేదా కరెన్సీ వంటివి ఏవీ లేవని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశం సైనికులకు జీతాలు చెల్లించట్లేదని ఆరోపించారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరిందని, ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే శక్తి లేదన్నారు.