మాస్కో : రష్యా నుంచి ముడి చమురు కొంటున్నదని ఇండియాపై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలను విధించడం ‘అగౌరవకర, అజ్ఞాన విధానం’ అని అమెరికా జర్నలిస్ట్ రిక్ సాంచెజ్ విమర్శించారు. రష్యాలో ఆయన శనివారం ఏఎన్ఐకు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాను అమెరికా స్కూల్ పిల్లాడిలాగా భావించ కూడదన్నారు.
‘ఇండియా పెద్ద పిల్లాడు, స్కూల్ చిన్నారి కాదు’ ఆయన వ్యాఖ్యానించారు. కక్ష, అశాస్త్రీయ ఆలోచనలతో ట్రంప్ తరచూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. సెకండరీ టారిఫ్లపై అమెరికా విధానాన్ని చాలా మంది ప్రజలు అసంబద్ధమైనదిగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. భారత్ తీసుకొనే నిర్ణయాల మీద పర్యవేక్షణ అవసరం అన్నట్టు అమెరికా ప్రవర్తించడాన్ని ఆయన విమర్శించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా విమర్శించడం ఆయన అస్థిర విధానాన్ని సూచిస్తున్నదని తెలిపారు.