వాషింగ్టన్, జూన్ 20: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ తాము ఎంతమాత్రం తగ్గేది లేదంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఖతార్‌లో తమ విమానాలు ఉంచిన అల్ ఉదిద్ ఎయిర్ బేస్ ఇరాన్‌కు సమీపంలో ఉండటంతో దానిపై దాడి చేసే ప్రమాదం ఉందని ఊహించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ఎయిర్‌బేస్‌లోని 40 విమానాలను గత రెండు వారాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ విషయాన్ని జూన్ 5-9 మధ్య ప్లానెట్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు నిర్ధారించాయి. పశ్చిమాసియాలోని అమెరికా అతి పెద్ద ఎయిర్ బేస్ ఇప్పుడు విమానాలు లేక బోసిపోయి ఖాళీగా కన్పిస్తున్నది.
ఉపగ్రహ చిత్రాల ప్రకారం జూన్ 5న సీ-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ విమానాలు, అధునాతన నిఘా జెట్లు ఈ సైట్లో పార్క్ చేసి ఉన్నాయి. అయితే జూన్ 19 నాటికి కేవలం మూడు విమానాలు మాత్రమే దర్శనమిచ్చాయి. పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ డాటాను విశ్లేషించిన ఏఎఫ్‌పీ వార్తా సంస్థ జూన్ 15 నుంచి 18 వరకు కేసీ-46ఏ పెగాసస్, కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ వంటి కనీసం 27 సైనిక ఇంధనం నింపే మిలిటరీ విమానాలు అమెరికా నుంచి యూరప్‌కు పయనమయ్యాయని తెలిపింది.