న్యూయార్క్ : ఇరాన్ అణు బాంబు(Nuclear Weapon) తయారు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై ఆ దేశం దాడికి దిగింది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసినట్లు ఎక్కడా ఆధారాలు దొరకడం లేదు. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఆ ఆధారాల కోసం వెతుకుతోంది. శుద్దీకరించిన యురేనియంను ఇరాన్ భారీ స్థాయిలో సేకరిస్తున్న విషయాన్ని అమెరికా అంగీకరిస్తున్నది. కానీ న్యూక్లియర్ బాంబును తయారు చేస్తున్నట్లు ఆధారాలు మాత్రం దొరకడం లేదని అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. గత కొన్ని నెలలుగా ఇదే అభిప్రాయంలో అమెరికా ఉంది. సేనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ టాప్ డెమోక్రటిక్ నేత మార్క్ వార్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించిన సమయంలో.. అణు బాంబు తయారీ దశకు ఇరాన్ చేరుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. కానీ అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ మాత్రం దీనికి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎటువంటి అణు బాంబును నిర్మించడం లేదని స్పష్టం చేశారు. తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా శాంతియుతంగా సాగుతున్నట్లు మరోవైపు ఇరాన్ చెబుతోంది.
ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల గురించి ఇంటెలిజెన్స్ కమిటీ వైస్ చైర్మెన్, డెమోక్రటిక్ సేనేటర్ మార్క్ వార్నర్‌తో పాటు ఇతర సేనేటర్లకు ఇటీవల వివరించారు. కానీ అమెరికా నిఘా సంస్థలకు మాత్రం ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉన్నట్లు ఆధారం చిక్కడం లేదు. ట్రంప్ విదేశాంగ విధానాన్ని డెమోక్రాట్ వార్నర్ తప్పుపట్టారు. చట్టసభ ప్రతినిధులకు తప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం అందుతున్నట్లు ఆయన చెప్పారు. తులసీ గబార్డ్ చేసిన వ్యాఖ్యలు ఒకలా ఉన్నాయని, ట్రంప్ ఆ వ్యాఖ్యలను ఖండించి మరో అనుమానాన్ని లేవనెత్తినట్లు వార్నర్ తెలిపారు.
అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేస్తున్నారని, ప్రస్తుత వ్యూహం విషయంలో అధ్యక్షుడు అస్పష్టంగా ఉన్నారని, అలాంటప్పుడు అమెరికా ప్రజలకు దీనిపై ఎలాంటి అవగాహ ఉంటుందని వార్నర్ ప్రశ్నించారు. ఇరాన్‌తో జరుగుతున్న పోరులో.. ఇజ్రాయిలీ మిలిటరీకి సపోర్టు ఇవ్వాలన్న అంశంపై ట్రంప్ సంపూర్ణ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ చేసిన వ్యాఖ్యలను మాత్రం ట్రంప్ సమర్థించారు.
ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలపై ఇజ్రాయిల్ వరుసగా దాడులు చేస్తూనే ఉన్నది. ఆ దేశ సుప్రీం నేత ఖమేనీ లొంగిపోవాలంటూ ట్రంప్ అభిప్రాపడ్డారు. ఖమేనీని చంపడం ఈజీయే అని కూడా ఆయన తెలిపారు. అయితే తాజా యుద్ధంలో ఒకవేళ ఇజ్రాయిల్ దళాలకు అమెరికా సైన్యం జత కలిస్తే, అప్పుడు ఇరాన్ పరిస్థితి దయనీయంగా మారే ఛాన్సు ఉంది. కానీ తామేమీ వెనక్కి తగ్గబోమని ఇరాన్ నేత వెల్లడించారు. ఈ సందర్భంలో అణు బాంబుల తయారీని అడ్డుకునేందుకు ఇరాన్‌ను నిలువరించే ప్రయత్నం ఎంత వరకు విజయం అవుతుందో వేచి చూడాల్సిందే.
ఇరాన్లో అణ్వాయుధాలు తయారీ అవుతున్నట్లు అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న వాదనల్లో నిజం లేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ సంస్థ పేర్కొన్నది. అణు బాంబులకు చెందిన ప్రూఫ్ దొరకడం లేదని ఐఏఈఏ చీఫ్ రఫేల్ గ్రోసీ తెలిపారు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్దం చెబుతున్నారన్న దాంట్లో కాంపిటీషన్ ఉందని, కానీ ఇరాన్ అణు బాంబు రూపొందించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. రేపే ఆ బాంబును ఇరాన్ తయారు చేయలేదని, ఇంకొన్నేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఇరాన్ వద్ద కావాల్సినంత యురేనియం ఉందని, కానీ అణ్వాయుధం తయారు చేయాలంటే టెక్నాలజీ, టెస్టింగ్ అవసరం అవుతుందని ఐఏఈఏ చీఫ్ తెలిపారు.