Syrians in US : ఇప్పటికే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా (USA).. సిరియన్ వలసదారులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సిరియా వలసదారులకు కల్పిస్తున్న తాత్కాలిక రక్షణ హోదా (Temporary Protected Status) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక రక్షణ హోదా కింద రక్షణ పొందుతున్న వారంతా 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే అరెస్టులు చేస్తామని హెచ్చరించింది.
కాగా వేల మంది సిరియన్ పౌరులు తాత్కాలిక రక్షణ హోదా (TPS) కింద అమెరికాలో నివసిస్తున్నారు. 2012 నుంచి దాదాపు 6 వేలకు పైగా సిరియా వలసదారులు ఈ రక్షణ పొందుతున్నట్లు అంచనా. ఈ క్రమంలో వారి బహిష్కరణపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ నెలకొన్న పరిస్థితులు వారిని తిరిగి స్వదేశానికి వెళ్లకుండా నిరోధించలేవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ వ్యాఖ్యానించారు.
సుమారు రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదం, ఉగ్రకార్యకలాపాలకు సిరియా కేంద్రంగా మారిందని, తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అక్కడి వారిని తమ దేశంలో ఉండేందుకు అనుమతించడం కుదరదని ట్రిసియా పేర్కొన్నారు. 60 రోజుల గడువులోగా స్వచ్ఛందంగా దేశం వీడాలని, లేదంటే సంబంధిత చట్టాల కింద అరెస్టు, డిపోర్టేషన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.