న్యూఢిల్లీ, జూన్ 22 : ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ఆర్థిక శాఖ 60 రోజులపాటు చెల్లుబాటు అయ్యే లైసెన్సును జారీ చేసింది. ఈ అనుమతి ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలకు వీలు కల్పిస్తుంది. ఇది ఆగస్టు 21 వరకు అమల్లో ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ ఉన్నతాధికారులతో తాను జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమైన తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పిన నేపథ్యంలో సోమవారం ఈ ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఈ లైసెన్సును పునరుద్ధరించకపోతే అది ఆగస్టు 21న గడువు ముగిసే అవకాశం ఉంది. గత వారం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ చర్య చేపట్టారు.
దీనికి ప్రతిఫలంగా ఇరాన్ హొర్ముజ్ జలసంధిని తెరుస్తుంది. అంతేగాక ప్రాథమిక ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరిస్తుందో లేదో పరిశీలించడానికి ఐఏఈఏ అణు పరిశీలకులను ఇరాన్ అనుమతిస్తుంది. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలకు అనుగుణంగా, హొర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛా, బహిరంగ రవాణాను అనుమతించడానికి, అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పరిశీలకులను తమ దేశంలోకి అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే క్యూబా, ఉత్తర కొరియా, ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతానికి చమురును విక్రయించడానికి ఈ అనుమతి (లైసెన్సు) అవకాశం కల్పించదు.
శాశ్వత శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో భేటీ కాగా.. ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తీవ్ర అవమానం ఎదురైనట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. వీడియోలు వైరల్ అయ్యాయి. జేడీ వాన్స్ ఎదురుచూస్తుండగానే ఇరాన్ విదేశాంగ మంత్రి వాకౌట్ చేయటం, ఖతార్ ప్రధాని పట్టించుకోకపోవటం వంటివి ఆ వీడియోల్లో కన్పించాయి. ఇరాన్ ప్రతినిధులు అమెరికా ప్రతినిధులతో ఫొటో సెషన్‌కు నిరాకరించి.. సమావేశం నుంచి వాకౌట్ చేశారు.