వాషింగ్టన్: కెనడా తీరానికి సమీపంలో మునిగిన టైటానిక్ నౌక శిథిలాల చూసేందుకు వెళ్లిన సబ్ మెర్సిబుల్ జలాంతర్గామి(Titanic Sub) మిస్సైన విషయం తెలిసిందే. అయితే ఉత్తర అట్లాంటిక్ తీరంలో అండర్‌వాటర్ శబ్ధాలను గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. మూడు రోజులుగా ఆ సబ్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నీటి నుంచి ధ్వనులు వస్తున్నాయని అమెరికా కోస్టు గార్డు తెలిపింది. కెనిడియన్ పీ-3 ఎయిర్‌క్రాఫ్ట్ అండర్‌వాటర్ ధ్వనులను గుర్తించినట్లు వెల్లడించారు.
మిస్సైన మినీసబ్ కోసం అమెరికా, కెనడా కోస్టు గార్డు నౌకలు విస్తారంగా శోధిస్తున్నాయి. దాదాపు 20వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రాన్ని అన్వేషిస్తున్నారు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో మినీ సబ్ ఆచూకీ లేకుండాపోయింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి భారీ శబ్ధాలు వస్తున్నట్లు గుర్తించామని కోస్టు గార్డులు వెల్లడించారు.
ఓసియన్గేట్ కంపెనీకి చెందిన టైటాన్ సబ్‌లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బ్రిటీష్ బిలియనీర్ హమీశ్ హార్డింగ్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త షెహజాద్ దావూత్తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. ఓసియన్గేట్ చీఫ్ స్టాక్టన్ రష్‌తో పాటు ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఆపరేటర్ పౌల్ హెన్రీ నర్జేలెట్ కూడా ఆ సబ్‌లో ఉన్నారు.