Lung Cancer | లండన్: ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలను ముందుగానే గుర్తించే పరీక్షా విధానాన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. మూత్రాన్ని పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించవచ్చునని తెలిపారు. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించే ఈ విధానం ప్రపంచంలోనే మొదటిది. ప్రస్తుత విధానాల్లో పరీక్షలు చేసినపుడు, వ్యాధి బాగా ముదిరిపోయిన దశలోనే గుర్తించడం సాధ్యమవుతున్నది. అటువంటి సందర్భాల్లో చికిత్సకు అవకాశాలు చాలా పరిమితంగా ఉండటంతోపాటు, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు ఈ విధానాలు చాలా ఖరీదైనవి కూడా. ప్రొఫెసర్ లిజిల్జన ఫ్రక్ తెలిపిన వివరాల ప్రకారం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఎర్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశల్లో కనిపించే జాంబీ సెల్ ప్రోటీన్స్‌ను గుర్తించే పరీక్షను అభివృద్ధి చేశారు. దెబ్బతిని, శరీరంలో సజీవంగా ఉండే సెల్స్‌నే జాంబీ లేదా సెనెసెంట్ సెల్స్ అంటారు. ఇవి వృద్ధి చెందవు, విడిపోవు. కానీ ఇవి వాటి పరిసరాలను మార్చుతాయి. క్యాన్సర్ అభివృద్ధికి అనువైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఊపిరితిత్తుల టిష్యూలోని జాంబీ సెల్స్ విడుదల చేసే ప్రొటీన్లతో ప్రతిచర్య జరపగలిగే ఇంజెక్టబుల్ సెన్సర్‌ను ఈ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ సెన్సర్‌ను శరీరంలోకి పంపినపుడు జరిగే ప్రతిచర్య వల్ల మూత్రంలోకి ఓ ప్రొటీన్ విడుదలవుతుంది. ఆ ప్రొటీన్ రెండు ముక్కలు అవుతుంది. ఒక భాగం మూత్రం ద్వారా బయటకు వస్తుంది. సిల్వర్ బేస్డ్ సొల్యూషన్ కలిపినపుడు అది కనిపిస్తుంది. క్యాన్సర్‌కు దారితీసే లక్షణాలు ఊపిరితిత్తుల్లో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని మూత్రం రంగునుబట్టి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షా విధానం చౌక ధరలో అందరికీ అందుబాటులో ఉంటుంది.