లక్నో: ఉత్తరప్రదేశ్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల కావడానికి ముందే ఏకంగా 16.18 లక్షల ఫారం-6 దరఖాస్తులను స్వీకరించి ఆమోదించిన వైనం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ ఓటర్ల వివరాలను తాము బహిర్గతం చేయకపోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశాలే కారణమని యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) నవద్వీప్ రిన్వా చేసిన వాదన అవాస్తవమని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం బయటపెట్టింది.
నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ జాబితా ప్రచురించిన తర్వాత ప్రారంభమయ్యే క్లెయిమ్లు, అభ్యంతరాల దశలో మాత్రమే కొత్త చేరికల కోసం ఫారం-6 సమర్పించాలి. అయితే సాధారణ ఓటర్లకు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలిసే అవకాశం కూడా లేని సమయంలోనే, యూపీ ఎన్నికల విభాగం ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడత పరిశోధన బయటకు రాగానే స్పందించిన యూపీ సీఈవో.. డ్రాఫ్ట్ జాబితాకు ముందే 16.18 లక్షల దరఖాస్తులను సేకరించిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా అంగీకరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ రోల్ విడుదలైన తర్వాత వచ్చిన దరఖాస్తులను మాత్రమే బహిర్గతం చేయాలని, ఈసీఐ ఆదేశాల మేరకే తాను వివరాలు దాచిపెట్టానని సమర్థ్ధించుకున్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సమయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా యూపీలోనే రికార్డు స్థాయిలో 96.27 శాతం దరఖాస్తులు ఆమోదం పొందడంపై వివరణ కోరగా, తాము ఎవరి సందేహాలు తీర్చే కన్సల్టెన్సీని నడపడం లేదంటూ ఫోన్ కట్ చేశారు. అయితే సీఈవో ఉదహరించిన ఈసీఐ అంతర్గత మార్గదర్శకాలను పరిశీలించగా ఆయన వాదనలు నిలబడలేదు. నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ జాబితా వెలువడకముందే దరఖాస్తులు స్వీకరించడానికి యూపీకి ఎలాంటి మినహాయింపులు లేవు. ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను, బూత్ లెవల్ అధికారులు క్రోడీకరించే ఫారం-9 సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టంగా నిర్దేశించింది.