మాస్కో, సెప్టెంబర్ 14: ప్రముఖ సామాజిక కార్యకర్త, జానపద కవి అన్నాభావు సాఠే విగ్రహాన్ని రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేశారు. ఆల్ రష్యా స్టేట్ లైబ్రరీ ఫర్ ఫారిన్ లిటరేచర్ భవనంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో సాఠే ఆయిల్ పెయింటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని సంగ్లిలో 1920 ఆగస్టు 1న జన్మించిన ఈయన.. దళితోద్ధరణకు కృషి చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఈయన రష్యా విప్లవం పట్ల ఆకర్షితుడయ్యారు. అనంతరం అంబేద్కరిస్టుగా మారారు. సాఠే.. మఠారీలో మొత్తం 35 నవలలు, 10 యక్షగానం, 12 ఫిల్మ్ స్క్రీన్‌ప్లేలు రాశారు. రష్యా యూనివర్సిటీల్లోనూ ఈయన పుస్తకాలు దర్శనమిస్తాయి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఈయనే.