మాస్కో: రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న సైనిక ఆయుధ బాండాగారంపై ఉక్రెయిన్ మిస్సైల్ దాడి చేసింది. పశ్చిమ రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న మిలిటరీ క్యాంపు నుంచి భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో రిలీజైంది. ఉక్రెయిన్-రష్యా బోర్డర్‌కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉంది. ఉక్రెయిన్ నుంచి కూడా మిలిటరీ క్యాంపు మంటలు కనిపిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని, నలుగురు సైనికులు గాయపడినట్లు రష్యా గవర్నర్ వచస్లేవ్ గ్లాడ్కోవ్ తెలిపారు. గత వారం కూడా ఇదే ప్రాంతంలో ఉక్రెయిన్ దాడి చేయడం వల్ల భారీ పేలుడు జరిగిందని, దాంట్లో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఒకేసారి రష్యా భూభాగంలోకి మిస్సైల్‌ను వదిలింది. ఫిబ్రవరిలో మిల్లెరోవో ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది. అయితే తాజా స్ట్రయిక్‌కు సంబంధించిన ప్రకటన ఇంకా చేయలేదు. ఓటీఆర్-21 టోచ్కా యూ బాలిస్టిక్ మిస్సైల్‌తో ఉక్రెయిన్ 19వ మిస్సైల్ బ్రిగేడ్ రష్యాలోని బెల్గరోడ్ క్యాంపుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కీవ్, చెనిహివ్ నుంచి దళాలను ఉపసంహరిస్తామని రష్యా ప్రకటన చేసిన రోజునే బెల్గరోడ్ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.