హైదరాబాద్: ఉక్రెయిన్‌లో (Ukraine) రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో భాగంగా మెలిటొపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌ను రష్యన్ సైనికులు గత శుక్రవారం బంధీగా పట్టుకున్నారు. అతడిని విడిపించడానికి తమ వద్ద బంధీలుగా ఉన్న తొమ్మిది మంది రష్యా సైనికులను (Russian Soldiers) ఉక్రెయిన్ వదిలిలేసింది. ఈ మేరకు ఇంటర్‌ఫ్యాక్స్ ఉక్రెయిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా, మేయర్ ఫెడొరోవ్‌ను రష్యా సైన్యం నుంచి విడిపించామని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. అయితే దీనికి సంబందించిన వివరాలు వెల్లడించలేదని వార్తా సంస్థ తెలిపింది.
కాగా, ఫెడొరోవ్ కోసం తొమ్మిది మంది సైనికులను వదిలేశామని జెలెన్స్కీ చెప్పారు. వారంతా చిన్నపిల్లలను.. వారు 2002, 2003లో జన్మించారని వెల్లడించారు. ఫెడొరోవ్‌ను రష్యన్ సైనికులు అపహరించుకుపోయారని ఉక్రెయిన్ గత శుక్రవారం ప్రకటించింది.
ఉక్రెయిన్‌లోని మరియుపోల్, కీవ్ సహా పలు నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. మరియుపోల్‌లోని థియేటర్‌పై మాస్కో బలగాలు బాంబులు విసిరాయి. దీంతో థియేటర్లో వందలాదిమంది పౌరులు తలదాచుకున్నారని, వారిలో భారీసంఖ్యలో చనిపోయి ఉండొచ్చని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని దవాఖానను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 400 మంది పౌరులు, వంద మంది వైద్యులు, రోగులను నిర్బంధించారు. చెర్నిగివ్లో జరిగిన బాంబుదాడిలో ముగ్గురు చిన్నారుల సహా ఐదుగురు మృతిచెందారు.