అమెరికా, ఫిబ్రవరి 26: అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగిస్తామన్న ట్రంప్.. ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. మొదట్లో ట్రంప్ డీల్‌కు అంగీకరించని జెలెన్స్కీ.. కొన్ని మార్పులతో పచ్చజెండా ఊపినట్టు ఒక అధికారి చెప్పారు.
శుక్రవారం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేసే అవకాశ ఉందని అంతర్జాతీయ మీడియాలు కథనాలు వస్తున్నాయి. వాషింగ్టన్లో జరిగే ఎంవోయూ కార్యక్రమంలో జెలెన్స్కీ కూడా పాల్గొంటారని తెలుస్తున్నది. ఈ ఒప్పందం 500 బిలియన్ డాలర్ల డీల్ అని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేలా అమెరికా పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక సాయం సహా వివిధ అంశాలు ఒప్పందంలో ఉన్నాయని తెలుస్తున్నది. ఈ ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌లో సగం సహజ వనరులపై అమెరికా అధిపత్యం లభించే అవకాశాలు ఉన్నాయి.