కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రెచ్చగొట్టడం వల్లనే కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆరోపించారు. రష్యా మీడియా స్పుత్నిక్‌తో ఆయన మాట్లాడారు. ఐరోపాలోనే అది పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని, ఇందులో ఆరు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అలాంటి చోట కాల్పులకు ఉక్రెయిన్ లేదా రష్యా సైనికులు సాహసం చేయరని చెప్పారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రెచ్చగొట్టడం వల్లనే అక్కడి శిక్షణా కేంద్రం నుంచి జరిగిన స్వల్ప కాల్పులు ఏకంగా అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడికి పురిగొల్పిందన్నారు. ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే కుట్ర అని, అమెరికా, బ్రిటన్‌కు జెలెన్స్కీ తప్పుడు సమాచారం ఇచ్చి రష్యాను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
కాగా, ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా శనివారం తాత్కాలికంగా విరామం ఇచ్చింది. పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు నగరాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించేందుకు అవకాశం కల్పించింది. మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈ కాల్పుల విరమణ అమలులో ఉంటుందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.