న్యూఢిల్లీ: రష్యా (Russia)తో సుదీర్ఘ యుద్ధంవల్ల అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ (Ukraine) ఓ శాంతి ప్రణాళికను (Peace Plan) రూపొందించుకుని, దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నది. వచ్చే ప్రపంచ శాంతి సదస్సు (Global Peace Summit) లో ఎలాగైనా తమ శాంతి ప్రణాళికకు ఆమోద ముద్ర వేయించుకోవాలని భావిస్తోంది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం హెడ్ అండ్రీ యెర్మాక్ (Andriy Yermak) భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) కు మరోసారి ఫోన్ చేసి తమదేశ శాంతి ప్రణాళికకు మద్దతు తెలుపాలని కోరారు. ప్రపంచ శాంతి సదస్సు ఏర్పాట్లపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దక్షిణార్ధగోళంలోని మెజారిటీ దేశాలు తమ శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటించేలా జోక్యం చేసుకోవాలని దోవల్‌ను యెర్మాక్ కోరారు.
తాజా పరిణామాలను బట్టి చూస్తే ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక కేవలం ఉక్రెయిన్ దేశానికి మాత్రమేగాక ప్రపంచ దేశాలకు చాలా ముఖ్యమనే విషయం రుజువైందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక అమలు కోసం త్వరగా ప్రపంచ శాంతి సదస్సు జరిగేలా అన్ని దేశాలు క్రీయాశీలకంగా పనిచేయాలని కోరింది. భారత్ కూడా ఇందులో భాగస్వామి అవుతుందని తాము భావిస్తున్నామని తెలిపింది.