న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. లుహాన్స్ రీజియన్‌లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
కాగా, అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ల్వీవ్, ఖార్కివ్, మర్యుపోల్ నగరాలపై బాంబు దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యతవహించాల్సి ఉంటుందన్నారు.