లండన్, మే 6: చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి, మృతుడి పెన్షన్ డబ్బులు కాజేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్ధీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండేండ్లు ఫ్రీజర్‌లో దాచిపెట్టాడన్న కేసులో 52ఏండ్ల డామియన్ జాన్సన్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని బ్రిటన్ కోర్టు దోషిగా తేల్చింది. స్థానిక వార్తా పత్రిక ‘మెట్రో’ కథనం ప్రకారం, 71ఏండ్ల జాన్ వెయిన్‌రైట్, డామియన్ జాన్సన్ క్లీవ్‌లాండ్ టవర్స్‌లో ఒకే ఫ్లాట్‌లో ఉండేవారు. సెప్టెంబర్ 2018లో వెయిన్‌రైట్ చనిపోతే, మృతదేహానికి డామియన్ జాన్సన్ అంత్యక్రియలు నిర్వహించకుండా రెండేండ్లుగా ఫ్రీజర్‌లో భద్రపర్చాడు. వెయిన్‌రైట్ చనిపోయాడన్న సంగతి బయటకు తెలియకుండా ఆగస్టు 2020 వరకు దాచిపెట్టాడు. రెండేండ్లుగా మృతుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్న పెన్షన్ డబ్బులు విత్‌డ్రా చేసి జల్సాలు చేశాడు. ఏటీఎం కార్డులతో షాపింగ్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కోర్టు విచారణ నవంబర్ 7కు వాయిదా పడింది. జాన్ వెయిన్‌రైట్ మృతికి కారణం ఏంటన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. జాన్సన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.