టెహ్రాన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన కార్గో షిప్, ఇరాన్ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఇరాన్ పోర్ట్ అస్సలుయేకు 30 మైళ్ల దూరంలో ‘అల్ సాల్మీ 6’ సరుకు రవాణా నౌక మునిగినట్లు సేలం అల్ మక్రానీ కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కెప్టెన్ నిజార్ ఖద్దౌరా ధృవీకరించారు. ఆ ఓడలో 30 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. అందులో 16 మందిని రెస్క్యూ టీం కాపాడినట్లు చెప్పారు. లైఫ్ బోట్లో మరో 11 మంది సరక్షితంగా ఉన్నట్లు వివరించారు. సముద్రం నుంచి ఒకరిని రక్షించగా, మరో ఇద్దరు ఇంకా నీటిలో ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, సముద్రంపై తేలియాడుతున్న కార్గో షిప్ సిబ్బందిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతున్నదని పేర్కొంది. సిబ్బంది అంతా లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని తెలిపింది. అయితే బలమైన గాలులకు లైఫ్ బోటుతోపాటు సముద్రంలో ఉన్న ఇద్దరిని చేరుకోవడం కష్టంగా ఉన్నదని వివరించింది.