స్టాక్హోమ్, అక్టోబర్ 6: అణు సమ్మేళనాల నిర్మాణానికి ‘అసిమెట్రిక్ ఆర్గానోక్యాటలైసిస్’ అనే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన జర్మన్ శాస్త్రవేత్త బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్ శాస్త్రవేత్త డేవిడ్ మెక్మిలన్లకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. అణు సమ్మేళనాలను తయారు చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. భిన్న రకాల పరమాణువులను ఒక్కచోట చేర్చి రసాయనిక చర్యలు జరుపడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ రసాయన చర్యలను నియంత్రించడానికి/వేగవంతం చేయడానికి ఉత్ప్రేరకాలు అవసరం. లిస్ట్, మెక్మిలన్లు అసిమెట్రిక్ ఆర్గానోక్యాటలైసిస్ విధానాన్ని అభివృద్ధి చేసేవరకు.. రెండు రకాల ఉత్ప్రేరకాలు(లోహాలు, ఎంజైమ్లు) మాత్రమే ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విడివిడిగా పరిశోధనలు జరిపి మూడో రకమైన ఉత్ప్రేరకాలు ఉన్నట్టు గుర్తించారు. ఆక్సిజన్, నైట్రోజ్, సల్ఫర్లాంటి వాటి ద్వారా అసిమెట్రిక్ ఆర్గానోక్యాటలైసిస్ విధానంలో అణు సమ్మేళనాలను తయారు చేయవచ్చని నిరూపించారు. వీరు 22 ఏండ్ల క్రితమే ఒకరికి తెలియకుండా ఒకరు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొనగా ఇప్పుడు నోబెల్ రావడం విశేషం. ఆర్గానో క్యాటలైసిస్ ఇప్పటికే ఫార్మా పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ విధానం పర్యావరణహితమైనది. చవక కూడా.