గాజా: ఇజ్రాయెల్‌పై అనుహ్యంగా గత శనివారం ఐదు వేల క్షిపణులతో దాడులు చేసిన హమాస్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అమెరికాపై అల్‌ఖైదా జరిపిన 9/11 తరహా దాడులుగా ఇజ్రాయెల్ పేర్కొన్న ఈ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీలు మరణించగా సుమారు మూడు వేల మంది గాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్‌పై జరిగిన ఈ అనూహ్య దాడుల వెనుక హమాస్ కమాండర్ మొహమ్మద్ దెయిఫ్ (Hamas commander Mohammed Deif) మాస్టర్ మైండ్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
హమాస్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్న దెయిఫ్, గాజాలోని హమాస్ నాయకుడు యెహ్యా సిన్వార్‌తో కలిసి ఇజ్రాయెల్‌పై దాడులకు రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్‌పై దాడుల కార్యాచరణకు సూత్రధారి అయిన మరో వ్యక్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. హమాస్‌కు ఆర్థికంగా, మిలిటరీ శిక్షణకు, ఆయుధాల సరఫరాకు అండగా ఉన్న ఇరాన్‌కు ఇజ్రాయెల్‌పై దాడుల ప్లాన్, కదలికల గురించి తెలిసినప్పటికీ దాడి సమయం గురించి తెలియదని హమాస్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, 1987లో హమాస్‌లో చేరిన మొహమ్మద్ దెయిఫ్ను 1989లో ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. 16 నెలల పాటు నిర్బంధంలో ఉంచింది. గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన దెయిఫ్ అనంతరం హమాస్‌లో కీలకంగా ఎదిగాడు. 2014లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భార్య, ఏడేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెతోపాటు కుటుంబ సభ్యులను కోల్పోయాడు.
మరోవైపు 2021తోసహా ఇజ్రాయెల్ హత్యా ప్రయత్నాల నుంచి ఏడుసార్లు తప్పించుకున్న మొహమ్మద్ దెయిఫ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఏడాది మేలో రంజాన్ సమయంలో ముస్లింలకు మూడవ పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేయడంపై మరింత రగిలిపోయాడు. ప్రార్థనలు చేస్తున్న వారిని కొట్టడంతోపాటు పెద్దలు, పిల్లలను మసీదు నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఈడ్చుకెళ్లడంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ ‘అల్ అక్సా ఫ్లడ్’కు ప్లాన్ వేశాడు.
కాగా, ఇజ్రాయెల్‌పై దాడులకు ముందు పాలస్తీనా టీవీలో దెయిఫ్ ప్రసంగించడంతో ఏదో జరుగబోతోందని ఆ దేశ ప్రజలు ఊహించారు. అయితే గాజాలో ఇజ్రాయెల్ అరాచకాలకు అంతం పలకాలన్న లక్ష్యంతో ఆ దేశంపై దాడికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు హమాస్ బాహ్య సంబంధాల అధిపతి అలీ బరాకా వెల్లడించారు.