Trump | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా తాత్కాలికంగా తమ ఆధీనంలోనే ఉంటుందని ప్రకటించిన ట్రంప్.. లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలైన క్యూబా, మెక్సికో, కొలంబియాలకు సైతం వార్నింగ్ ఇచ్చారు.
డ్రగ్స్ తయారీ, మాదక ద్రవ్యాల ముఠాలకు క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలు ఆశ్రయమిస్తున్నాయని, అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కారణంతో వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ దేశాలు తమ పద్ధతి మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాల్లోని డ్రగ్స్ ఉత్పత్తి ల్యాబ్‌లపై దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా కొలంబియాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. కొలంబియాలో మూడు ప్రధాన కొకైన్ తయారీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వాళ్లే కొకైన్‌ను తయారు చేసి, అమెరికాకు పంపిస్తున్నారని.. అందుకే అతను జాగ్రత్తగా ఉండాలంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి హెచ్చరించారు.
కాగా, వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా సైన్యం బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో దేశాలు ఖండించాయి. ఇది దురాక్రమణ కిందకే వస్తుందని స్పష్టం చేశాయి. ఈ పరిణామాలు దక్షిణ అమెరికా మొత్తం భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొన్నాయి. ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని.. వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.