వాషింగ్టన్, అక్టోబర్ 7: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్‌లోని విద్యార్థుల నిరసనలు ఆ దేశ సామూహిక వలసలు, దేశాన్ని ఇస్లాం తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకుంటున్న ప్రగాఢ కాంక్షను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఫ్రాన్స్‌లో జరుగుతున్నది అదుపుతప్పిన వలసలు తప్ప మరేమీ కాదు. ఇది పాఠశాలలకు సంబంధించిన సమస్య కాదు. ఒక గొప్పదేశాన్ని ఇస్లాం ఆధీనంలోకి తీసుకోవాలన్న కాంక్షకు సంబంధించిన విషయం’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో తెలిపారు. సౌకర్యాల లేమి, టీచర్ల కొరతను నిరసిస్తూ ఫ్రాన్స్‌లోని 15-17 ఏండ్ల విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
లాస్ ఏంజెలెస్, శాన్ డియాగోను ఇరాన్ నాశనం చేయనివ్వండి!
కాలిఫోర్నియా నగరాలైన లాస్ ఏంజెలెస్, శాన్ డియాగో గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీశాయి. ఇరాన్‌కు అణ్వాయుధాన్ని దక్కకుండా చేయడానికి అమెరికన్లు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని నెబ్రాస్కాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ట్రంప్ చెప్పిన ఒక రోజు తర్వాత మంగళవారం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రపంచాన్ని, మన దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఇది చాలా చిన్న మూల్యం అని ట్రంప్ అన్నారు.
ఇంధన, ఎరువుల ధరల పెరుగుదల సహా యుద్ధం వల్ల కలిగే పర్యవసానాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టు కనిపిస్తున్నది.ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వారు(ఇరాన్) ఒక నగరాన్ని నాశనం చేయగలరు. లాస్ ఏంజెలెస్‌ను నాశనం చేయనివ్వండి. శాన్ డియాగోను నాశనం చేయనివ్వండి. ఇది చెల్లించాల్సిన చాలా చిన్న మూల్యం. పైగా ఇది చాలా త్వరగా ముగిసిపోతుంది అని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకునేందుకు అనుమతిస్తే అది అమెరికా నగరాలపై దాడి చేయగలదని ట్రంప్ వ్యాఖ్యల్లోని అర్థమని వైట్‌హౌస్ తెలిపింది. అయితే దేశంలోని కొన్ని నగరాలను వదిలేయవచ్చని లేదా వాటిని త్యాగం చేయవచ్చని అధ్యక్షుడు సూచించారని కొందరు డెమోక్రాట్లు సహా రిపబ్లికన్లు ఆరోపించారు.