Donald Trump | న్యూయార్క్: అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసే జనవరి 20న సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నది. క్యాపిటల్ హిల్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో రిపబ్లికన్ సెనేటర్లకు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. యూఎస్-మెక్సికో సరిహద్దులో చొరబాట్ల కట్టడి, ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్ ఉద్యోగుల నిబంధనలు, స్కూల్ జెండర్ పాలసీ, టీకాలు, ఎన్నికల హామీలు తదితర అంశాలకు సంబంధించిన అంశాలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ హాజరవుతారని కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్రంప్-వాన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కమిటీ ఆహ్వానం భారత్కు అందిందని… భారత ప్రభుత్వ ప్రతినిధిగా జైశంకర్ హాజరవుతారని కేంద్రం తెలిపింది. జై శంకర్ తన పర్యటనలో ట్రంప్ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులను, ఇతర ముఖ్యులను కలుసుకుంటారు.