Donald Trump : ఇరాన్ (Russia) తో శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా (Saudi Arabia) కంటే తమ వద్దే ఎక్కువ చమురు (oil) ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన చమురు, గ్యాస్‌ను నింపుకోవడానికి ప్రపంచ దేశాలకు చెందిన అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరంవైపు వస్తున్నాయని పేర్కొన్నారు. ‘మేం మీకోసం ఎదురు చూస్తున్నాం.. త్వరితగతిన స్పందించండి’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎక్కడికైనా చమురు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. మరికొన్ని గంటల్లో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు పలు షరతులు విధిస్తుండడంతో కాల్పుల విరమణ ప్రయత్నాలు ఆలస్యమవుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్థాన్‌కు వచ్చి నాలుగు గంటలకుపైగా అయినప్పటికీ.. ఇరాన్ ప్రతినిధులతో ఇంకా ప్రత్యక్ష చర్చలు జరపలేదు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ఇప్పటికే వాన్స్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇరాన్ అధికారుల బృందం పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని రెండు ప్రధాన షరతులను ఇరాన్ అమెరికా ముందు ఉంచింది. అవి అమలైతేనే చర్చలు జరుగుతాయని స్పష్టంచేసింది.