Buyout | వాషింగ్టన్, జనవరి 29: కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే పనిని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన బైఅవుట్లు ప్రకటించారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల జీతం అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ మానవ వనరుల సంస్థ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఒక మెమో జారీ చేసింది. ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
సుమారు 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ-మెయిళ్లు పంపింది. ఉద్యోగాన్ని వీడాలనుకునే వారికి 8 నెలల జీతాన్ని చెల్లిస్తామని, వారు తమ నిర్ణయాన్ని ఫిబ్రవరి 6 లోగా తెలియజేయాలని పేర్కొంది. తొలుత 10-15 శాతం మంది దీనికి ఓకే చెప్పవచ్చునని, దాంతో ప్రతి ఏడాది ప్రభుత్వంపై 100 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందని అంచనా. గత ఏడాది నవంబర్ నాటికి దేశంలో సుమారు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బైఅవుట్తో ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, పలు రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడవచ్చునని నిపుణులు పేర్కొన్నారు.