న్యూఢిల్లీ: అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ పడిపోయాయి. ఆ దేశ కరెన్సీ డాలర్ విలువ కూడా తగ్గిపోయింది. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యవహరిస్తున్న తీరు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చీఫ్ జెరోమీ పావెల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. జెరోమీ పెద్ద లూజర్ అని, వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ట్రంప్ విమర్శించారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అభివృద్ధి అంశాల్లో పావల్ చాలా నమ్మెదిగా స్పందిస్తున్నారని ఆరోపించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థను పావెల్ సరైన రీతిలో హ్యాండిల్ చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం .. స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. ఆర్థిక సంక్షోభం వస్తుందేమో అన్న భయంలో అమెరికన్లు ఉన్నారు. అయితే ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో సోమవారం ఎస్ అండ్ పీ 500 కంపెనీల్లో స్టాక్స్ పడిపోయాయి. సుమారు 2. 4 శాతం మేర స్టాక్స్ పతనం అయినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పుత్తడిపై ఎఫెక్ట్ పడింది. బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది.