వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మీడియాతో మాట్లుడుతూ.. గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ అనుసరించిన పాలసీ విధానాలను తప్పుబట్టారు. వారివల్లే విమాన ప్రమాదం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఆకాశ భద్రతా ప్రమాణాల విషయంలో ఒబామా, బైడెన్ రాజీపడ్డారని ఆరోపించారు. మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో నియంమించిందని ఆరోపించారు. తాను మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఒబామా, బైడెన్, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, తాము మాత్రం సమర్ధులైన వారినే కాలాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పారు.
ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన సంభాషణల టేపులను విన్నానని, ప్రమాదంలో పైలట్ తప్పేమీ లేదన్నారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ ఎగరడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఎవరైనా తప్పిదానికి పాల్పడ్డారనే విషయం తనకు తెలియదన్నారు. ఈ ప్రమాదం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని వెల్లడించారు. అంతకుముందు బాధితులకు ట్రంప్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు.
కాగా, ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృతిచెందారు. విమానంలో ఉన్న 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సైనికులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 28 మంది మృతదేహాలను పోటోమాక్ నది నుంచి వెలికితీశామని తెలిపారు. బుధవారం సాయంత్రం రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. కాన్సాస్‌లోని విచిట నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రాంతీయ విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేకు అతి సమీపంలో, పోటోమాక్ నదిపైన ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యి పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేలకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు సైన్యం ధ్రువీకరించింది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు. కాగా, అమెరికాలో గత 24 ఏండ్లలో ఎక్కువ మంది మరణాలకు కారణమైన విమాన ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు.