Russia | రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్ను రష్యాలో కలపాలని ఆశపడ్డ ఆయనకు.. సొంతమనిషి నుంచే దిమ్మదిరిగే కుదుపు ఎదురైంది. తన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటు ప్రకటించింది. రోస్తోవ్, ఒరోజెన్ నగరాలను స్వాధీనం చేసుకొని మాస్కో దిశగా సాగుతున్న ఆ దళాలు హఠాత్తుగా తమ పయనాన్ని విరమించుకున్నాయి. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకు తిరుగుబాటును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.
మాస్కో, జూన్ 24: రష్యాలోఅధ్యక్షుడు పుతిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటుదారులు తమ పురోగమనాన్ని విరమించటంతో రష్యన్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కీలకమైన రోస్తోవ్, ఓరోజెన్ నగరాలను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు వాగ్నర్ సేనలు మాస్కో దిశగా పయనిస్తుండగా, తమ పురోగమనాన్ని నిలిపివేస్తున్నట్టు గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తాము తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు తెలిపారు. తాను స్వయంగా పెంచి పోషించిన వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సవాలుగా నిలిచింది.
మాస్కో దిశగా వాగ్నర్ సేనలు వస్తున్నట్టు తెలిసి వారిని ఎదుర్కొనేందుకు రష్యన్ సైనికులు సర్వసన్నద్ధం అయ్యారు. అధికార యంత్రాంగానికి అడ్డు తగిలితే ఎవరినైనా, ఎలాంటి విచారణ లేకుండా 30 రోజులపాటు జైళ్లలో నిర్బంధించే ఆదేశాలపై పుతిన్ సంతకం చేశారు. మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం వెళ్లిన వాగ్నర్ సేనలు హఠాత్తుగా తమ పురగోమనాన్ని విరమించి తిరిగి ఉక్రెయిన్‌కు వెళుతున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్ మాత్రం వాగ్నర్ తిరుగుబాటుపై సంతోషం వ్యక్తం చేసింది. దుర్మార్గాలకు పాల్పడేవారు వాటిచేతనే నాశనమవుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిస్థితి పాముకు పాలుపోసి పెంచినైట్టెంది. ఆయన సొంత అవసరాల కోసం సృష్టించిన అత్యంత కిరాతక కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్.. చివరకు పుతిన్‌పైనే తిరుగుబాటు చేసింది. రష్యా సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించటమే తమ లక్ష్యమని యెవ్జెనీ ప్రిగోజిన్ అంతకుముందు ప్రకటించారు. ఈ తిరుగుబాటు ప్రకటనతో రష్యాతోపాటు యూరప్ ఖండం మొత్తం ఉలిక్కిపడింది. తిరుగుబాటు ప్రకటనతో ఆగకుండా రష్యాలోని ఒక్కో నగరాన్ని ఆక్రమించుకొంటూ ముందుకు వెళ్లారు. రోస్తోవ్, ఒరోజెన్ నగరాలను ఆక్రమించారు. యుద్ధట్యాంకులతో దేశ రాజధాని మాస్కోవైపు కదిలారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు సమసిపోయినట్టు తెలిసింది. వాగ్నర్ సేనలు డిమాండ్ చేసినట్టుగా రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగూను పదవి నుంచి తొలగించేందుకు పుతిన్ అంగీకరించినట్టు తెలిసింది.
వాగ్నర్ తిరుగుబాటుపై అధ్యక్షుడు పుతిన్ నిప్పులు కక్కారు. ప్రిగోజిన్ తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘ఇది నమ్మకద్రోహం. ప్రిగోజిన్ నాకు వెన్నుపోటు పొడిచాడు. దేశద్రోహానికి పాల్పడ్డాడు. నా దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకొనేందుకు ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకొంటా. శత్రుదేశాల మద్దతుతోనే ఈ తిరుగుబాటు మొదలైంది. ప్రిగోజిన్‌కు మద్దతుగా ఆయుధాలు పట్టిన ప్రతి ఒక్కరినీ కఠినంగా అణచివేస్తాం. అందుకోసం రష్యా సైన్యానికి పూర్తి అధికారాలు ఇస్తున్నా’ అని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ ప్రకటించారు. పుతిన్‌కు రష్యా పార్లమెంటు, సైన్యం మద్దతు ప్రకటించాయి. పుతిన్‌కు సన్నిహితుడు, చెచెన్యా నాయకుడు రామ్జాన్ కదిరోవ్ కూడా పుతిన్‌కు మద్దతు ప్రకటించారు.
పుతిన్ ప్రకటనపై తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ దీటుగా స్పందించారు. అతి త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రకటించి.. పుతిన్‌ను కూలదోస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ‘అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశద్రోహానికి పాల్పడలేదు. మేం దేశభక్తులం. బ్యూరోక్రాట్లు, సైనిక అధిపతులు, రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దేశాన్ని నాశనం కానివ్వం’ అని ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్జీ షొయిగు, సైన్యాధ్యక్షుడు జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌ను శిక్షించటమే తమ లక్ష్యమని చెప్పారు. చివరికి శనివారం అర్ధరాత్రి తమ తిరుగుబాటును విరమించి తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు ప్రిగోజిన్ ప్రకటించడంతో రష్యన్లు ఊపిరి పీల్చుకున్నారు.
వాగ్నర్ గ్రూప్‌పై రష్యా సైన్యం దాడి మొదలుపెట్టినట్టు సమాచారం. వాగ్నర్ ఆధీనంలోకి వెళ్లిన రోస్తోవ్, ఒరోజెన్ నగరాలపై రష్యా యుద్ధవిమానాలు బాంబులు కురిపించాయని స్థానికులు తెలిపారు. ఒరోజెన్లో నిన్నటివరకు సైన్యం ఆధీనంలో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై బాంబులు వేయటంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు మాస్కో దిశగా కదులుతున్న వాగ్నర్ కాన్వాయ్‌పై వైమానిక దాడులు జరుగుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లూ ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించిన రష్యా యుద్ధవిమానాలు.. ఇప్పుడు సొంత నగరాలపైనే క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. తిరుగుబాటును తిప్పికొట్టేందుకు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్బీ) రంగంలోకి దిగింది. ప్రిగోజిన్‌పై దేశద్రోహం కేసు నమోదుచేసి మాస్కోలోని ఆ సంస్థ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నది.
రష్యాపై తిరుగుబాటు నేపథ్యంలో వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ఎవరనే దానిపై విపరీతంగా చర్చ నడుస్తున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సొంత పట్టణం సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రిగోజిన్. పుతిన్‌కు అత్యంత సన్నిహితుల్లో, నమ్మకస్తుల్లో ఒకడిగా మారకముందు హాట్ డాగ్(తినే పదార్థం) అమ్మకందారుగా ఉన్నారు. సోవియట్ పాలన సమయంలో మోసం, దొంగతనం కేసులో దాదాపు దశాబ్దం పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత 1990ల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ప్రారంభించారు. అనంతర కాలంలో పుతిన్, ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. ప్రిగోజిన్ స్థాపించిన కంపెనీ క్రెమ్లిన్ కోసం పనిచేయడంతో పాటు, ప్రిగోజిన్ ‘పుతిన్ చెఫ్’గా పేరుగాంచాడు. 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర బయటకు వచ్చింది. ప్రిగోజిన్‌తో పాటు ఆపరేషనల్ కమాండర్ దిమిత్రి ఉత్కిన్, సాయుధ దళాల మాజీ కల్నల్ అండ్రీ త్రోషెవ్, పీఎంసీ కార్యకలాపాల ఇన్చార్జి పికలోవ్ వాగ్నర్ గ్రూపులో కీలక వ్యక్తులుగా ఉన్నారు.
వాగ్నర్ గ్రూప్‌నకు ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన కిరాయి సైన్యంగా పేరున్నది. దీనిని రష్యా సైన్యమే 1990 దశకంలో ఏర్పాటు చేసింది. అయితే, అధికారికంగా ఈ సంస్థ ఎక్కడా రిజిస్టర్ కాలేదు. శత్రుదేశాల్లో తన చేతులకు మట్టి అంటకుండా ఆపరేషన్స్ నిర్వహించేందుకు వాగ్నర్ గ్రూపును అధ్యక్షుడు పుతిన్ వాడుతుంటారని సమాచారం. వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (పీఎంసీ)ని రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రీ ఉత్కిన్ ప్రారంభించారు. పుతిన్ అధ్యక్షుడయ్యాక ఈ సంస్థ ప్రిగోజిన్ చేతుల్లోకి వచ్చింది. రష్యా సైన్యానికి మద్దతుగా ఈ సంస్థ ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడినట్టు చెప్తారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రారంభించటానికి ముందు వరకు ఈ సంస్థలో దాదాపు 6000 మంది కిరాయి సైనికులు ఉన్నట్టు అమెరికా అంచనా వేసింది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుకాగానే ప్రిగోజిన్ రష్యాలోని అన్ని జైళ్లను సందర్శించి వాటిల్లోని దొంగలు, బందిపోట్లు, సైన్యంలో అనుభవం ఉన్నవారితోపాటు తుపాకీ కాల్చటం చేతనైన ప్రతి ఒక్కరినీ వాగ్నర్‌లో చేర్చుకొన్నారు. దీంతో సంస్థ సభ్యుల సంఖ్య ఒక్కసారిగా 50 వేలు దాటింది. ఈ సైన్యం కొద్ది నెలల క్రితం కీలకమైన బఖ్ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నది. అయితే, ఈ యుద్ధంలో వాగ్నర్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా సైన్యాన్ని నమ్మి యుద్ధంలో ముందుండి పోరాడినా.. కీలక సమయంలో సైన్యం నుంచి మద్దతు లభించకపోవటంతో వేలమంది వాగ్నర్ సైనికులు బలయ్యారు. పైగా, సమన్వయ లోపంతో ఉక్రెయిన్‌లోని మిలిటరీ బేస్‌లపై రష్యా సైన్యం క్షిపణులు, భారీ ఫిరంగులతో దాడి చేయటంతో ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలతో సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ కక్ష పెంచుకొన్నాడు. నిజానికి మొదట్లో వాగ్నర్ గ్రూప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వెతికిపట్టుకొని చంపడానికే పంపించారు. కానీ, ఉక్రెయిన్ సైన్యం నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు కావటంతో ఈ కిరాయి సైనికులు పూర్తిస్థాయిలో యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆ గ్రూప్ ఏకంగా సొంత దేశంపైనే తిరుగుబాటు మొదలు పెట్టింది.