టోక్యో: వారంలో 70 నుంచి 90 గంటలు పని చేయాలని మన దేశంలోని ప్రముఖులు సూచిస్తున్న తరుణంలో, జపాన్ వారానికి నాలుగు రోజుల పని దినాలను అమలు చేయడం ప్రారంభించింది. ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో సాయపడటమే లక్ష్యంగా టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టోక్యో గవర్నర్ యురికో కొయికే మెట్రోపాలిటన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, కుటుంబం-కెరీర్ మధ్య ఏదో ఒకదానిని ఎంచుకునే పరిస్థితిని మహిళలకు కల్పించకూడదనేదే తమ లక్ష్యమని చెప్పారు. జీవితంలో పిల్లల్ని కనడం వంటి ఘట్టాలు వృత్తిపరమైన అభివృద్ధికి ఆటంకంగా నిలవని సమాజాన్ని నిర్మించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పరిశోధన ప్రకారం పని దినాల సంఖ్య తగ్గడం వల్ల పిల్లల సంరక్షణలో పురుషులు మరింత భాగస్వాములయ్యేందుకు దోహదపడుతుంది.