కీవ్: యుద్ధ సమయాల్లో మాతృభూమిని కాపాడుకునేందుకు సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు. శత్రువును అడ్డుకునేందుకు ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు. కొందరు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు. రష్యా ట్యాంకులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఒక ఉక్రెయిన్ సైనికుడు ఏకంగా బ్రిడ్డి వద్ద తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ఆ వంతెన కూలిపోవడంతో రష్యా ట్యాంకులు ముందుకు వెళ్లలేకపోయాయి.
ఈ నెల 24న రష్యా దాడిని ప్రారంభించినప్పుడు మైన్లతో నిండి ఉన్న క్రిమియా, ఉక్రెయిన్ ప్రధాన భూభాగాన్ని కలిపే వ్యూహాత్మక హెనిచెస్క్ వంతెనను ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్ మెరైన్ బెటాలియన్ ఇంజనీర్ విటాలీ స్కాకున్ వోలోడిమిరోవిచ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. కీలకమైన బ్రిడ్జీని పేల్చి వేసేందుకు బాంబులు అమర్చాడు.
అయితే రష్యా ట్యాంకులు దూసుకు వస్తుండాన్ని ఆ సైనికుడు గమనించాడు. బాంబులకు ప్యూజ్ అమర్చి దూరంగా వెళ్లి సురక్షితంగా పేల్చిందుకు తనకు తగిన సమయం లేదని గ్రహించాడు. దీంతో తనను తాను పేల్చుకుని ఆ వంతెనను ధ్వంసం చేశాడు.
కాగా, మెరైన్ సైనికుడు వోలోడిమిరోవిచ్ వీరోచిత మరణం, ప్రాణ త్యాగాన్ని ఉక్రెయిన్ ఆర్మీ కొనియాడింది. ఆయనను హీరోగా అభివర్ణించింది.