Moon | న్యూయార్క్ : భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నదని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ భౌతిక శాస్త్రవేత్తలు బిజునాథ్ పట్ల, నీల్ అశ్బీ చంద్రుడిపై సమయాన్ని గుర్తించేందుకు ఒక అధ్యయనం జరిపారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా జరిగిన ఈ స్టడీ వివరాలు ‘ఆస్ట్రోనామికల్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ప్రామాణిక గడియారం రేటు దాని స్థానంలో ఉన్న గురుత్వాకర్షణ, సాపేక్ష చలనం ద్వారా ప్రభావితమవుతుంది.
ఈ లెక్కన భూమి కంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నందున చంద్రుడిపై కాలం వేగంగా గడుస్తున్నదని వీరు తేల్చారు. భూమితో పోలిస్తే చంద్రుడిపై రోజుకు 56 మైక్రో సెకన్లు వేగంగా గడియారం నడుస్తున్నట్టు పేర్కొన్నారు. తమ అధ్యయనం కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తుందన్నారు. 56 మైక్రో సెకన్లు చిన్న విషయమైనా, చంద్రుడిపైకి ప్రయోగాలు జరిపేందుకు కీలకమైన నావిగేషన్ విషయంలో చాలా ముఖ్యమైనదని చెప్పారు.