
ప్రఖ్యాత వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్. దీన్ని భారత్‌లో బ్యాన్ చేశారు కానీ, అమెరికా సహా చాలా దేశాల్లో ఇప్పటికీ ఈ యాప్ అందుబాటులోనే ఉంది. ఈ క్రమంలోనే బాగా పాపులర్ అయిన కొన్ని టిక్‌టాక్ ఛాలెంజ్‌లు చాలా సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇటీవల టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కుర్రాళ్లు అర్ధరాత్రి పూట ఇంటి తలుపులను బలంగా తన్ని వీడియోలు షేర్ చేశారు.
ఇప్పుడు శుక్రవారం నాడు అమెరికా వ్యాప్తంగా స్కూళ్లలో కాల్పులు, బాంబింగ్‌లు జరుగుతాయంటూ టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. కొందరైతే దీన్నో ఛాలెంజ్‌లా ఇతరులకు విసురుతున్నారు. ఇటీవలే మిచిగాన్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఒక విద్యార్థి తన తోటి వారిపై కాల్పులకు తెగబడిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్‌ను చూసి స్కూలు యాజమాన్యాలు వణికిపోతున్నాయి. కొన్ని స్కూళ్లు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తుంటే, మరికొన్ని శుక్రవారం అసలు పూర్తిగా స్కూళ్లు మూసేయాలని నిర్ణయించుకున్నాయి.
ఈ ట్రెండ్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇది ఫేక్ అని అధికారులు చెప్పినా ఫలితం ఉండటం లేదు. ఈ ఛాలెంజ్‌పై దర్యాప్తు చేసిన అధికారులు ఇది అరిజోనాలో ప్రారంభమైనట్లు గుర్తించారు. కానీ దీన్ని మొదలుపెట్టిన వాళ్లు ఎవరనేది మాత్రం తెలియరాలేదు.