బెర్లిన్: జర్మనీలోని సోలింజన్ నగరంలో వేడుక జరుగుతున్న సమయంలో.. ఓ ఉన్మాది తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా అటాక్(Knife Attack) చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం సిటీ సెంటర్లో ఓ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఆ దాడి జరిగింది. దాడికి పాల్పడిన ఉన్మాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పారిశ్రామిక నగరమైన సొలింజన్లో 650వ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి.
నిందితుడు కావాలనే బాధితుల మెడపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసు ప్రతినిధి అలెగ్జాండర్ క్రెస్టా తెలిపారు. అతని ఆచూకీ చిక్కడం లేదన్నారు. ఫ్రాన్హాఫ్ మార్కెట్ ఏరియాను వదిలి వెళ్లాలని ప్రజల్ని పోలీసులు కోరారు. సెక్యూర్టీ కార్డన్ ఏర్పాటు చేశారు. గాయపడ్డవారికి ఎమర్జెన్సీ సిబ్బంది చికిత్స అందిస్తోంది. ఉన్మాదిని పట్టుకునేందుకు 40 వాహనాలను రంగంలోకి దింపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వేట మొదలుపెట్టారు.