లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో.. ముగ్గురు హిందువులను(Hindus Kidnapped) దొంగల ముఠా కిడ్నాప్ చేసింది. వాళ్లకు చెందిన వ్యక్తులను రిలీజ్ చేయకుంటే, ఆ హిందువులను చంపివేస్తామని బెదిరించారు. పంజాబ్ ప్రావిన్సులోని రహిమ్ యార్ ఖాన్ జిల్లాలోని బోంగ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. లాహోర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉన్నది.
షామన్, షమీర్, సాజన్ అనే ముగ్గుర్ని దొంతలు ఎత్తుకెళ్లారు. బోంగ్లోని హెల్త్ సెంటర్ వద్ద ఉన్న సమయంలో.. అయిదుగురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి.. గన్‌పాయింట్‌లో బెదిరించి.. ముగ్గురు హిందువులను కచ్చా ఏరియాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత రింగు లీడర్ ఆషిక్ కొరాయి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తమ కుటుంబానికి చెందిన పది మందిని రిలీజ్ చేస్తేనే, కిడ్నాప్ అయిన ముగ్గురు హిందువులను సురక్షితంగా రిలీజ్ చేస్తామని ఆ వీడియోలో పోలీసుల్ని బెదిరించాడు.
హిందువులకు బేడీలు వేసి ఉన్నట్లు వీడియోలో చూపించారు. ఒకవేళ తమ సభ్యుల్ని రిలీజ్ చేయకుంటే హిందువుల్ని చంపేసి, పోలీసులపై దాడులు చేయనున్నట్లు ఆ వీడియోలో హెచ్చరించారు. కచ్చా ఏరియాలో గత ఏడాది దొంగల ముఠా చేసిన దాడిలో 12 మంది పోలీసులు మృతిచెందారు, ఏడు మంది గాయపడ్డారు.
పంజాబ్, సింధు ప్రావిన్సు సరిహద్దుల్లో ఉన్న కచ్చా నదీ పరివాహక ప్రాంతంలో దొంగల ముఠా సంచరిస్తూ ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆ దొంగల ముఠాలను పట్టుకునేందుకు పంజాబీ పోలీసులు ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిసారి మైనార్టీలను ఎత్తుకెళ్లి, పోలీసుల్ని బెదిరించడం వాళ్లకు అలవాటైపోయింది.