హైదరాబాద్: సాధారణంగా పర్యాటకులు ఏదైనా నగరాన్నిగానీ, పట్టణాన్నిగానీ సందర్శిస్తే వందలకొద్ది సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఆ నగరం లేదా పట్టణంలో కనిపించిన ప్రతి మూవ్‌మెంట్‌ను తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తుంటారు. అయితే, సెల్ఫీలు తీసుకోవడం అనేది పర్యాటకులకు బాగానే ఉన్నా.. గుంపులు, గుంపులుగా పర్యాటకులు చేతుల్లో మొబైల్ ఫోన్లు పట్టుకుని తమ పరిసరాల్లో తిరుగుతుంటే స్థానికులకు మాత్రం కొంత అసౌకర్యంగానే ఉంటుంది. ఇటలీకి చెందిన ఒక పట్టణంలో ఈ అసౌకర్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది.
ఇటలీలోని పోర్ట్ ఓఫినో పట్టణానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం భారీ సంఖ్యలో పర్యాటకులు పట్టణాన్ని సందర్శిస్తుంటారు. చేతుల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలు పట్టుకుని ఫొటోలు, సెల్ఫీలు దిగుతుంటారు. అయితే, పర్యాటకుల తాకిడివల్ల వీధుల్లో తరచూ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. వీధులన్నీ రద్దీగా ఉంటుండటంతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పోర్ట్ ఓఫినో పట్టణ పాలనా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సెల్ఫీలు తీసుకునే పర్యాటకులపై జరిమానా విధిస్తోంది.
పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, పర్యాటకులు ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేందుకు ఆరాటపడే ప్రాంతాలను నో వెయిటింగ్ జోన్లుగా ప్రకటించింది. ఆయా జోన్లలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువసేపు గడిపినా, సెల్ఫీలు తీసుకున్నా రూ.25 వేల వరకు భారీగా జరిమానాలు విధిస్తున్నది. ఈ నో వెయిటింగ్ జోన్లను ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కచ్చితంగా అమలు చేస్తున్నట్లు పోర్ట్ ఓఫినో మేయర్ మెటియో వయకావా తెలిపారు. ఈస్టర్ వారాంతంలో మొదలైన ఈ నిబంధనలు వచ్చే అక్టోబర్ వరకు కొనసాగుతాయని చెప్పారు.