న్యూయార్క్ : ప్రాణాంతక వ్యాధుల బారిన పడ్డ వారి ఆయుష్షు పెంచేందుకు ఉపయోగపడే ప్రపంచంలోని మొదటి క్రయోప్రిజర్వేషన్ వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏఐ శాస్త్రవేత్త, యాంటీ ఏజింగ్ పరిశోధకుడు డాక్టర్ అలెక్స్ ఝావోరోన్కోవ్, మాలిక్యూలర్ బయాలజిస్ట్ హషేమ్ అల్ ఘైలి కలిసి ‘టైమ్షిఫ్ట్’ పేరుతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రాణాంతక వ్యా ధుల బారిన పడ్డ వారిని ఈ క్రయోప్యాడ్లలో పెడితే వారి ఆరోగ్యం మరింత క్షీణించకుండా చూడొచ్చని, వారి న్యూరోడీజెనరేటీవ్ వ్యాధులు, క్యాన్సర్ల అభివృద్ధిని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నేండ్ల పాటు మనుషులను వీటిల్లో పెట్టవచ్చని, తద్వారా వారికి అందించాల్సిన చికిత్సను అభివృద్ధి చేసేందుకు పరిశోధకులకు సమయం లభిస్తుందని తెలిపారు. ఈ క్రయోప్యాడ్లలో -196 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో మంచు ఏర్పడకుండా కొన్ని గ్యాస్‌లను, క్రయోప్రొటెక్టన్స్లను వాడతారు. సాధారణంగా మృతదేహాన్ని ఎక్కువకాలం భద్రపరచడానికి ఇలా తక్కువ ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు. తాము మొదటిసారి జీవించి ఉన్న మనుషులను కాపాడేందుకు ఈ క్రయోప్యాడ్లను తయారుచేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. మనిషి ఈ ప్యాడ్‌లో ఉన్నప్పుడు వారి సన్నిహితులు మాట్లాడటానికి ఒక ఏఐ ఆధారిత అవతార్‌ను సైతం తయారు చేస్తామని తెలిపారు.