న్యూయార్క్, అక్టోబర్ 7 : విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికాలోని బింఘామ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క గదిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు కొంత మొత్తంలో విద్యుత్తును సైతం ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. పరిశోధనలో భాగంగా వీరు ఐదు ఆకులతో కూడిన కృత్రిమ మొక్కను తయారుచేశారు. దీని నుంచి దాదాపు 140 మైక్రోవాట్ల విద్యుత్తు తయారైనట్టు ప్రొఫెసర్ సియోక్యూన్ చోయ్ తెలిపారు.
ఈ సాంకేతికతను మెరుగుపరిచి ఒక మిల్లీవాట్ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని, దీనికి లిథియం అయాన్ బ్యాటరీలను జత చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో దీని ద్వారా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉండేలా మారుస్తామని తెలిపారు. సాధారణంగా బయట కంటే గదిలోనే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుందని, ఈ కృత్రిమ మొక్క గదిలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, ఆక్సిజన్‌గా మార్చడంలో బాగా పని చేస్తున్నట్టు చెప్పారు. ఈ కృత్రిమ మొక్కకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్డ్ సైస్టెనబుల్ సిస్టమ్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.