Fertilo | లిమా, డిసెంబర్ 19: ‘ఫెర్టిలో’ అనే సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ప్రపంచంలోనే మొదటిసారి ఓ శిశువు జన్మించింది. ఫెర్టిలో పద్ధతి ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ.. పెరూ దేశ రాజధాని లిమాలోని సాంటా ఇసాబెల్ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. అమెరికాలోని గేమ్టో అనే సంస్థ ఈ కొత్త సంతానోత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు.
అయితే, ఈ ప్రక్రియ సుదీర్ఘమైనది, ఖరీదైనది కావడం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గేమ్టో సంస్థ ఫెర్టిలో అనే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఐవీఎఫ్ విధానంలో అండాలు పరిపక్వం చెందేలా ప్రేరేపించడానికి దాదాపు 90 హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ విధానం ఖరీదైనదిగా మారింది.
ఈ ఫెర్టిలో విధానంలో మహిళ నుంచి అండాన్ని సేకరించి ల్యాబ్‌లో పరిపక్వం చెందేలా చేస్తారు. ఇందుకు ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్(ఐపీఎస్సీ) నుంచి సేకరించే ఓవరియన్ సపోర్ట్ సెల్స్(ఓఎస్సీ)ను వినియోగిస్తారు. దీంతో హార్మోన్ ఇంజెక్షన్ల అవసరం గణనీయంగా తగ్గడంతో పాటు మొత్తం ప్రక్రియ వేగవంతం అవుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని గేమ్టో సంస్థ చెప్తున్నది. అండం పరిపక్వం చెందిన తర్వాత చేసే మిగతా ప్రక్రియ మొత్తం ఐవీఎఫ్లానే ఉంటుంది.