వాషింగ్టన్, జనవరి 8: అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి ఒంటారియో వెళ్తున్న క్రమంలో దాదాపు 16 వేల అడుగుల ఎత్తులో అలస్కా ఎయిర్‌లైన్స్ విమానం డోర్ ఊడిపోయిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. డోర్ ఊడిపోవడంతో పలు వస్తువులు, ప్రయాణికుల చేతుల్లోని ఫోన్లు విమానం నుంచి కిందపడ్డాయి. అలా కిందపడ్డ ఒక ఐఫోన్‌ను గుర్తించారు.
అన్ని వేల అడుగుల ఎత్తు పైనుంచి పడినప్పటికీ ఆ ఫోన్ బాగానే పనిచేస్తున్నదని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ) అధికారులు వెల్లడించారు. ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్నదని, సగం బ్యాటరీ చార్జ్ ఉన్నదని, బార్నెస్ రోడ్డు పక్కన ఫోన్‌ను గుర్తించిన సీనాథన్ బేట్స్ అనే ఎక్స్ యూజర్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. సంబంధిత ఫోన్ మాడల్‌పై స్పష్టత లేనప్పటికీ, ఐఫోన్14 ప్రో లేదా ఐఫోన్ 15 ప్రో అని ప్రచారం జరుగుతున్నది.