వాషింగ్టన్: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ‘యూక్లిడ్’ స్పేస్ టెలిస్కోప్‌ను స్పేస్ ఎక్స్ సంస్థ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ చరిత్రాత్మక మిషన్‌కు ఫ్లోరిడాలోని కేప్ కనవేరల్ వేదికైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఈ టెలిస్కోప్‌ను ప్రయోగించారు.
ఇది దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనికి దాదాపు నెల రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండు నెలల్లో పని ప్రారంభిస్తుందని, ఆరేండ్ల పాటు పని చేస్తుందని తెలిపారు. కోట్ల పాలపుంతల్ని యూక్లిడ్ జల్లెడ పడుతుంది. విశ్వం ఆవిర్భావం, కృష్ణబిలాలు తదితర అంశాలపై స్పష్టత కోసం ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.