లండన్, జూలై 9: సిగరెట్ తాగి మాస్క్ ధరించే వారిలో కార్బన్ మోనాక్సైడ్ విడుదల రెండు రెట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ మొత్తం శరీరంలోకి వెళ్లి రక్తనాళాల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు తెలిపారు. యురోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఈ మేరకు అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరైంది. పనివేళల్లో ధూమపానప్రియులు సిగరెట్ తాగి వెంటనే మాస్క్ ధరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సిగరెట్ తాగిన వెంటనే మాస్క్ ధరించడం వల్ల వారిలో విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ రెండు రెట్లు పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. 40 మంది సంప్రదాయ సిగరెట్ తాగేవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సంప్రదాయ సిగరెట్ తాగేవారిలో బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ 8.00 పార్ట్స్ ఫర్ మిలియన్ నుంచి 12.15 పీపీఎం వరకు పెరుగుతుందని తేల్చారు. సిగరెట్ అలవాటు లేనివారిలో ఎలాంటి తేడా లేదన్నారు.