బీజింగ్: బంగ్లాదేశ్ యువతులను పెళ్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ దేశంలోని తమ పౌరులకు చైనా రాయబార కార్యాలయం సూచించింది. మ్యారేజ్ స్కామ్స్ పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ భార్యల కొనుగోలు వంటి ఆలోచనను పక్కనపెట్టాలని, అక్రమ వివాహ ఏర్పాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. చైనాలో పెరుగుతున్న వధువు అక్రమ రవాణాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీచేసింది.
చైనాలో నిన్నమొన్నటి వరకు ఒకే సంతానం విధానం అమలు చేయడంతో దాదాపు 3 కోట్ల మంది చైనా పురుషులు భాగస్వామి దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దీంతో విదేశీ వధువులకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో వివాహం పేరుతో బంగ్లాదేశ్ మహిళలను చైనాకు అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి.